"WELCOME TO THE AIPEU GROUP-C TELANGANA CIRCLE"

Friday 28 October 2016

కాంట్రాక్టు, పర్మినెంటు తేడా లేదు.. ఒకే పనికి ఒకే వేతనం

ఇది ఉద్యోగుల హక్కు.. కాంట్రాక్టు పేరిట తక్కువ జీతం తప్పుశ్రమ దోపిడీకి కృత్రిమ ప్రాతిపదికలు చెల్లవు.. సుప్రీం సంచలన తీర్పు

'కాంట్రాక్టు ఉద్యోగులకూ శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాల్సిందే' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. 'ఒకే పనికి... ఒకే రకమైన వేతనం' అన్న విధానాన్ని అనుసరించాల్సిందే అని స్పష్టం చేసింది. జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీచేసింది.

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా తనకు వేతనం చెల్లించాలని ఆయన కోరారు. అయితే... కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్‌ ఉద్యోగుల్లా వేతనాలు వర్తించవని పంజాబ్‌, హరియాణా ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పింది.
ఈ తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు పక్కన పెట్టింది. ''ఒక రకమైన పని చేస్తున్న వారందరికీ ఒకే విధమైన వేతనం అందాలి. కార్మికులకు వారి ప్రయోజనాలు అందకుండా చేసేందుకు కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించడం తప్పు. ఒకవిధమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఒకే రకమైన పని చేస్తున్న వ్యక్తికి (కాంట్రాక్టు పేరిట)...
మరొకరికంటే (పర్మినెంట్‌) తక్కువ జీతం ఇవ్వడం కుదరదు. మరీ ముఖ్యంగా సంక్షేమ రాజ్యంలో అస్సలు కుదరదు'' అని ధర్మాసనం పేర్కొంది. ''ఎవ్వరూ తమ ఇష్టం ప్రకారం తక్కువ వేతనం తీసుకుని పని చేయడు. తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు...
తప్పని సరి పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని, హుందాను, స్వీయ విలువను తగ్గించుకుని మరీ తక్కువ జీతానికి పని చేస్తారు. అలా చేయకపోతే తమపై ఆధారపడిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని తెలుసు'' అని తీర్పు రాసిన జస్టిస్‌ ఖేహర్‌ పేర్కొన్నారు. ''ఒకే రకమైన పరిస్థితుల్లో, ఒకేరకమైన పని చేసే వారి మధ్య వేతనాల్లో తేడా ఉండటమంటే... శ్రమను దోచుకోవడమే.
ఇది కచ్చితంగా అణచివేత చర్యే'' అని స్పష్టం చేశారు. 'అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందంపై భారత 1979 ఏప్రిల్‌ 10వ తేదీన సంతకం చేసింది. దీని ప్రకారం సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు లభించింది. దీనిని నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు.
అంతేఆదు... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 141 ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం పొందడమనేది తిరుగులేని హక్కు. ఉద్యోగి పర్మినెంటా, కాంట్రాక్టా అనే అంశంతో నిమిత్తం లేదు'' అని ధర్మాసనం తేల్చి చెప్పింది.

No comments:

Post a Comment